కొత్తకోట రూరల్: కానాయపల్లి ఆర్‌అండ్‌ఆర్ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కాంట్రాక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి కొనసాగుతున్న లెవలింగ్, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తం చేయడంతో పాటు వేగంగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలో డ్రా విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని అప్పటిలోగా పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ అనుమతి మేరకు 1,034 మంది లబ్ధిదారులకు డిసెంబర్ మొదటి వారంలో ప్లాట్ల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిగతా వారికి కూడా ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వానికి నివేదించామని.. అనుమతి రాగానే కేటాయిస్తామని చెప్పారు. ఉద్యోగరీత్యా, కూలీ పనులు, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు 95 మంది పేర్లు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో లేవని, వారికి సైతం ప్లాట్లు, బెనిఫిట్స్ వచ్చాకే ప్లాట్ల కేటాయింపు జరగాలని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. అంతేగాకుండా గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్లాట్లు కేటాయించాలన్నారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతానికి పునరావాస కేంద్రంలో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. 95 మందితో పాటు 18 ఏళ్లు నిండిన వారికి ప్లాట్ల కేటాయింపు ప్రభుత్వం దృష్టిలో ఉందని, వారికి సైతం న్యాయం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని వివరించారు. అనంతరం కలెక్టర్ కొత్తకోటలోని దండుగడ్డకాలనీలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. వసతులను పరిశీలించి రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఉపకేంద్రాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, పంచాయతీరాజ్‌శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్, తహసీల్దార్ సుభాష్‌నాయుడు, ఎంపీడీఓ వినీత్, పీఏసీఎస్ అధ్యక్షుడు రావుల జితేంద్రనాథ్‌రెడ్డి, రావుల కరుణాకర్‌రెడ్డి, సాయిలు, గోకరయ్య, బాజ గిరన్న, బందెన్న, దారమోని రాములు, యాటకిరి అంజన్న, నాగరాజు, బాలరాజు, లక్ష్మీనారాయణ, హోటల్ రాజు, వడ్డె నాగరాజు, రవీందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


