వినాయకా.. వీడ్కోలిక | - | Sakshi
Sakshi News home page

వినాయకా.. వీడ్కోలిక

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

వనపర్తిటౌన్‌/కొత్తకోట రూరల్‌: జిల్లాకేంద్రంతో పాటు కొత్తకోటలో గణనాథుల నిమజ్జన వేడుకలు గురువారం రాత్రి కనులపండువగా సాగాయి. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. జిల్లాకేంద్రంలోని రాజమహల్‌ మహాగణపతి శోభాయాత్ర ఆధ్యంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చివరి రోజు శాస్త్రోక్తంగా కుంభం పోసి ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా భారీ క్రేనన్‌ను తెప్పించి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. సన్నాయి వాయిద్యాలు, డప్పుల మోత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రూ.5.50 లక్షలు పలికిన లడ్డూ..

రాజమహల్‌ మహాగణపతి లడ్డూ గతేడాది రూ.8 లక్షలు పలకగా.. ఈసారి రూ.5.50 లక్షలు పలికింది. చీర్ల సంతోష్‌ పాట పాడి దక్కించుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన గణపతి లడ్డూను రాఘవేంద్ర అనే భక్తుడు రూ.2.18 లక్షలకు దక్కించుకున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి పలు గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

వనపర్తి: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి హెచ్‌బీ స్థాయి పరీక్షలను తప్పనిసరి నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్‌)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణుల పరీక్షల విభాగం, ఇతర వార్డులను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య రికార్డులను పరిశీలించి వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. హెచ్‌బీ స్థాయి ఆధారంగా రక్తహీనతను తగ్గించేలా అవసరమైన చికిత్స, మందులు అందించాలన్నారు. అనంతరం ఆస్పత్రిలోని స్కానింగ్‌ గదిని తనిఖీ చేసి అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివరాలను సక్రమంగా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రికి జ్వరంతో వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చికిత్స అందించాలన్నారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ పరిసరాల్లో నీరు నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు దోమల వృద్ధికి అవకాశం లేకుండా చూడాలన్నారు. వైద్యాధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో మండలాల వారీగా ఎదుగుదల లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ఎన్‌ఆర్‌సీకి తరలించి సరైన చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. చంద్రమోహన్‌, డా. సాయినాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement