గ్రామాభివృద్ధితోనే దేశ పురోగతి | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధితోనే దేశ పురోగతి

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

వనపర్తిటౌన్‌: యువతలో సేవా దృక్పథాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే జాతీయ సేవా పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రఘునందన్‌ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో–ఎడ్‌)లో ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు యువత తమవంతు కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి తన గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలపై అవగాహన పెంచుకొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలన్నారు. దేశ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని, కళాశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు, జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉమా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు ధాంసింగ్‌, డా. రాఘవేంద్ర, డా. యాదగిరిగౌడ్‌, డా. రామకృష్ణమూర్తి, మల్లయ్య, అధ్యాపకులు మల్లికార్జున్‌, నాగలక్ష్మి, సునీతబాయి, బీచుపల్లి, స్వప్న, కిరణ్‌సింగ్‌, మహేష్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ కోతలు..

సబ్‌స్టేషన్‌ ముట్టడి

పాన్‌గల్‌: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మండలంలోని నిజామాబాద్‌ (మంగళ్లపల్లి) గ్రామస్తులు, రైతులు గురువారం మండలంలోని కేతేపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. తరుచూ విద్యుత్‌ కోతలతో పంటలకు, గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. బుధవారం రాత్రి నుంచి సరఫరా నిలిచిపోవడంతో చీకటిలో ఇబ్బందులు పడ్డామని, తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామానికి ప్రత్యేక బ్రేకర్‌ ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక స్తంభాలు, లైన్‌ ఏర్పాటు చివరి దశలో ఉందన్నారు. అక్టోబర్‌ మొదటి వారం వరకు పూర్తిచేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెప్పడంతో వారు శాంతించారు.

రెడ్‌క్రాస్‌ కార్యవర్గం

ఎన్నిక లాంచనమే

వనపర్తి: రెడ్‌క్రాస్‌ జిల్లా మేనేజింగ్‌ కమిటీ ఎన్నికకు గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించారు. ముందు ఊహించిన విధంగానే కేవలం 15 నామినేషన్లు దాఖలవడంతో ఏకగ్రీవం కానున్నట్లు స్పష్టమైంది. కమిటీలో సభ్యుల సంఖ్య 15కు పరిమితం.. అందుకు తగినట్లుగానే నామినేషన్లు దాఖలు కావడంతో లాంచనప్రాయమేనన్న వాదనలు వినిపించాయి. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై మల్లాగుల్లాలు కొనసాగుతున్నాయి. సేవాభావంతో పని చేసేవారికి చైర్మన్‌ పదవి దక్కాలనే ఉద్దేశ్యంతో సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎస్టీ గురుకులాల్లో

ఇంటర్‌ సీట్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 9 ఎస్టీ గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 26 లోగా సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులు చేసుకోవాలని, కోఆర్డినేటర్‌ కల్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని సర్టిఫికెట్‌లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement