వనపర్తి రూరల్: ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన సహాయ సేవలతో పాటు సమగ్ర విద్య అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి చిన్నారికి సమాన విద్యా అవకాశాలు కల్పించి.. వారి ప్రతిభను వెలికితీయడమే సమగ్ర విద్య లక్ష్యమన్నారు. భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనంతరం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ. 44లక్షలతో నిర్మించిన అదనపు గదులను మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదినితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు మార్కెట్‌యార్డులో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కోదండ రామిరెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర పాల్గొన్నారు.


