జీఓల్లో నిధులు.. కానరాని పనులు | - | Sakshi
Sakshi News home page

జీఓల్లో నిధులు.. కానరాని పనులు

Sep 18 2026 1:21 AM | Updated on Sep 18 2026 1:21 AM

కౌన్సిలర్ల

ఎదురుచూపులు..

ఆయా పుర కౌన్సిల్‌ సమావేశాల్లో పాలకవర్గం చర్చించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. అమలు చేయడానికి నిధులు లేకపోవడం పాలకవర్గాలకు ఇబ్బందిగా మారింది. వార్డుల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు నిధులు వస్తాయని ఆశించిన కౌన్సిలర్లకు ఎనిమిది నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి.

మంత్రి హామీతోనే

కదలిక..

ఆత్మకూర్‌, అమరచింత పురపాలికల్లో మంత్రి వాకిటి శ్రీహరి హామీతో పనుల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఆయా పురపాలికల్లో అభివృద్ధి పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. మిగతా పురపాలికల్లోనూ నిధుల విడుదలకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వనపర్తి టౌన్‌: జిల్లాలోని ఐదు పురపాలికల అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం రూ.78.07 కోట్లు మంజూరు చేస్తూ జీఓలు జారీచేసి ఏడాది గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వనపర్తి పురపాలికలకు యూఐడీఎఫ్‌ నిధులు రూ.18.07 కోట్లు, ఆత్మకూర్‌, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట పురపాలికలకు నగరాభివృద్ధి నిధుల కింద ఒక్కో పురపాలికకు రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.60 కోట్లు కేటాయించారు. వీటితో సీసీ రహదారులు, డ్రైనేజీలు, వరద కాల్వలు, పార్క్‌ల అభివృద్ధి తదితర వాటికి ఈ నిధులను వినియోగించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలోనే పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినా.. నిధుల లేమితో అడుగులు పడటం లేదు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకుగాను నిధుల కోసం కౌన్సిలర్లు ఆశగా ఎదురుచూస్తుండగా.. విడుదలలో జాప్యం నిరాశకు గురిచేస్తోంది.

వనపర్తిలో..

వనపర్తి పురపాలికకు యూఐడీఎఫ్‌ నిధులు రూ. 18.07 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు కొంతమేర ఉపయోగపడతాయని కౌన్సిల్‌ ఆశించింది. కాని పనుల పురోగతిపై వివరాలు అడిగినప్పుడు నిధులు విడుదల కాలేదనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పకుండా.. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని సమాధానం ఇస్తుండటం గమనార్హం. దీంతో అసలు ప్రక్రియ ఏ దశలో ఉందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీఓ జారీ అయి నెలలు గడుస్తున్నా.. మంజూరైన నిధులు ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

● ఆత్మకూర్‌, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట పురపాలికలు ఒక్కోదానికి నగరాభివృద్ధి నిధులు రూ.15 కోట్లు కేటాయించారు. ఆయా పురాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వరద కాల్వలు, పార్క్‌ల అభివృద్ధి తదితర పనులు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ నిధుల విడుదల ఆలస్యం కావడంతో వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది.

పెబ్బేరు, కొత్తకోటలో టెండర్లు పూర్తయినా..

పెబ్బేరు, కొత్తకోట పురపాలికల్లో చేపట్టాల్సిన పలు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడం అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. కాగితాలపై పూర్తయిన ప్రక్రియకు క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పురపాలికలకు గతేడాది రూ.78.07 కోట్లు మంజూరు

నేటికీ విడుదల కాని వైనం .. కుంటుపడుతున్న అభివృద్ధి

వనపర్తి, కొత్తకోట, పెబ్బేరులో ప్రారంభంకాని పనులు

మంత్రి చొరవతో అమరచింత, ఆత్మకూర్‌లో కదలిక

టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది

వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అగ్రిమెంట్‌ పూర్తికాగానే పనుల ప్రారంభానికి చర్యలు చేపడతాం. సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తాం.

– ప్రశాంత్‌, ఏఈ, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement