వనపర్తి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.దీప అన్నారు. గురువారం వనపర్తి మండలం పెద్దగూడెంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని గృహహింస నిరోధక చట్టం, బాల్యవివాహాల నిర్మూలన, తల్లిదండ్రుల సంరక్షణ తదితర చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హక్కులను వినియోగించుకోవడంతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా చట్టాలకు లోబడి నడుచుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, సర్పంచ్ పుష్పలత పాల్గొన్నారు.


