ప్రజాసంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమానికి పెద్దపీట

Sep 18 2026 1:21 AM | Updated on Sep 18 2026 1:21 AM

వనపర్తిటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన సాగిస్తూ.. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలవడంతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని శాసనమండలి చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య జిల్లాలో 3.84 కోట్లకు చేరిందన్నారు. మహిళల ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.161.16 కోట్లు భరించిందని తెలిపారు. 85,383 మంది లబ్ధిదారులకు రూ. 500కే 5,12,439 సిలిండర్లు అందించామని.. సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.15.71 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. 2025–26లో 9,023 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.7.72 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మరో 956 సంఘాలకు రూ.3.16 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.

జాతీయ పతాకం

ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి,

ఎస్పీ సునీతారెడ్డి

మాట్లాడుతున్న

పట్నం మహేందర్‌రెడ్డి

జిల్లాలో విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం

రూ.కోట్ల నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలు

కర్నెతండా ఎత్తిపోతలతో 4,235 ఎకరాలకు సాగునీరు

అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో శాసనమండలి చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీపట్నం మహేందర్‌రెడ్డి

అన్నదాతకు అండగా..

రైతు సంక్షేమంలో భాగంగా 2025–26లో రైతుబీమా ద్వారా 702 కుటుంబాలకు రూ.35.10 కోట్లు అందించినట్లు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. 2026 వానాకాలం రైతుభరోసా కింద 1,82,768 మంది రైతులకు ఎకరాకు రూ. 6వేల చొప్పున రూ.212.32 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మినుము, కంది, జొన్న, ఆముదం, కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1,127 క్వింటాళ్ల మినుము విత్తనాలను రాయితీపై పంపిణీ చేశామని.. 3,750 ఎకరాలకు సరిపడా వేరుశనగ విత్తనాలను పూర్తి సబ్సిడీతో అందించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. రూ.76.19 కోట్లతో చేపట్టిన కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తయి వినియోగంలోకి వచ్చిందని.. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లోని చెరువులను నింపడంతో పాటు 4,235 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

పేద కుటుంబాలకు భరోసా..

జిల్లాలోని 1,83,568 రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. కొత్తగా 26,465 రేషన్‌ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో 1,04,000 మంది అదనపు కుటుంబ సభ్యులను చేర్చినట్లు పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద 85,423 కుటుంబాలకు 21.60 లక్షల జీరో విద్యుత్‌ బిల్లులు జారీ చేసి, రూ.62.60 కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. చేయూత పథకం ద్వారా జిల్లాలో 70,342 మందికి ప్రతినెలా రూ.16.33 కోట్ల మేర పింఛన్లు అందుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement