వనపర్తి రూరల్: గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. పెబ్బేరు మండలం రంగాపూర్ కృష్ణానది తీరంలో బ్రిడ్జి వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం గుర్తించిన ప్రదేశాన్ని గురువారం వనపర్తి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ ఓడీ రమేశ్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై పోలీసు అధికారులతో సమీక్షించారు. కృష్ణానదిలో నీటిమట్టం తక్కువగా ఉన్నందున గణేశ్ విగ్రహాలను తీసుకొచ్చే వాహనాలు నిమజ్జన ప్రదేశం వరకు వెళ్లేందుకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. వాహనాల రాకపోకలు, భక్తులకు రక్షణ, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులు పోలీసుశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నీటిమట్టం, నదీ తీర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల నిర్వాహకులు కూడా పోలీసుల సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట ఎస్‌ఐలు వెంకటేశ్‌గౌడ్, హిమబిందు ఉన్నారు.


