వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం సాధించాలి

Sep 18 2026 1:21 AM | Updated on Sep 18 2026 1:21 AM

వనపర్తి: జిల్లాలోని బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక మేరకు లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026–27 మొదటి త్రైమాశిక జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ, సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక మేరకు రూ.5990.50 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. మొదటి త్రైమాసికం ముగిసే వరకు కేవలం రూ.1366.47 కోట్ల రుణాలు మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయన్నారు. అందులోనూ ఎంఎస్‌ఎంఈ, విద్యా, గృహ రుణాలు చాలా తక్కువ శాతం గ్రౌండింగ్‌ అయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన వంటి పథకాలు ప్రతి ఒక్క ఖాతాదారుకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. అదే విధంగా జిల్లాలో గృహ రుణాలు కేవలం 12.47శాతం మాత్రమే లక్ష్యం సాధించడం జరిగిందని.. వందశాతం సాధించేందుకు విరివిగా గృహ రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేక బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని.. అలాంటి వారికి బ్యాంకులు ఉదారంగా గృహ రుణాలు అందజేయాలని సూచించారు. అలాగే ఎంఎస్‌ఎంఈ రుణాలు అత్యధిక శాతం ఇచ్చి, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో దోహదపడాలన్నారు. పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను విజయవంతం చేసేవిధంగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎన్‌.ఖీమ్యానాయక్‌, ఎల్‌డీఎం శివకుమార్‌, ఆర్‌బీఐ ఏజీఎం వి.ప్రదీప్‌చంద్ర యూబీఐ డీజీఎం డి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement