ఎగువ జలకళ.. దిగువ వెలవెల! | - | Sakshi
Sakshi News home page

ఎగువ జలకళ.. దిగువ వెలవెల!

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

పెద్ద చెరువు బోసిపోతుంది..

భూత్పురు కాల్వ ద్వారా వచ్చే సాగునీటితో అమరచింత పెద్ద చెరువు నిండి అలుగు పారేది. ఈసారి కాల్వకు సాగునీరు విడుదల చేస్తున్నా ఎగువలో ఉన్న రైతులు దిగువకు నీరు వెళ్లకుండా తూములను మూసివేసి, నీటిని తమ తమ గ్రామాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో అమరచింత పెద్ద చెరువు నీరులేక బోసిపోయింది. బోరుబావులు కూడా రీచార్జి కావడం లేదు. పంటలు ఎండుముఖం పడుతున్నాయి.

– లక్ష్మీనారాయణ, రైతు, అమరచింత

లష్కర్‌తో పర్యవేక్షణ..

మక్తల్‌ మండలం నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్‌ మండలాల వరకు విస్తరించి ఉన్న భూత్పురు కాల్వ వెంట లష్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 32 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట ముగ్గురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. తూముల షట్టర్లు ధ్వంసం చేశారని తెలుసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిత్యం కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం.

– బాలకృష్ణ, ఏఈ, ఇరిగేషన్‌శాఖ

అమరచింత: భూత్పురు రిజర్వాయర్‌ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎగువన ఉన్న రైతులు కాల్వ తూముల షట్టర్లను పగులగొట్టి సాగునీటిని తమ తమ గ్రామాలకు తీసుకెళ్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్‌ నుంచి అమరచింత, ఆత్మకూర్‌ మండలాలకు సాగునీరు అందించే భూత్పురు కాల్వ వెంట ఆయకట్టు రైతులు నిత్యం తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

32వేల ఎకరాల ఆయకట్టు..

భూత్పురు రిజర్వాయర్‌ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మక్తల్‌, నర్వ, అమరచింత, ఆత్మకూర్‌ మండలాలు ఉండగా.. మొత్తం 35 గ్రామాల్లోని 32వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని భూత్పుర్‌ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. ఈసారి గత జూలైలో ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. అయితే చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు, పిన్నంచర్ల గ్రామ చెరువుల్లోకి సాగునీరు చేరుకోలేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంటను పండించుకునే రైతులకు ఈసారి సాగునీరు వస్తుందని ఆరుతడి పంటలను సాగుచేసుకున్నారు. తీరా కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడం.. నీటిని ఎగుమ గ్రామాల రైతులు మళ్లించుకుని వెళ్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అమరచింత, పిన్నంచర్ల గ్రామాల రైతులు నిత్యం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల వరకు కాల్వ వెంట వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

భూత్పురు రిజర్వాయర్‌ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు

ఎగువన ఎడమ కాల్వ తూముల షట్టర్ల ధ్వంసం

మూడు నెలలుగా నీరు పారుతున్నా నిండని చెరువులు

అమరచింత, పిన్నంచర్ల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement