పకడ్బందీగా సర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా సర్‌ ప్రక్రియ

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

గోపాల్‌పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపుక లెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం గోపాల్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో చేపట్టిన సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రచార దినోత్సవం సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే పౌరులకు అవసరమైన సమాచారం అందించాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు కావాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ తిలక్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

వనపర్తి రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన విప్లవ నాయకుడు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.బాల్‌రెడ్డి అధ్యక్షతన సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు లేని సమాజం కోసం ఏచూరి చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థి దశలోనే ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. దేశంలో మతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలో లౌకిక శక్తుల ఐక్యత కోసం ఏచూరి నిరంతరం కృషి చేశారన్నారు. ప్రతిపక్షాల ఐక్యత, ఇండియా కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించే విధానాల కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌, రాజు, లక్ష్మి, గోపి, ఉమా పాల్గొన్నారు.

ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్‌ కవర్‌ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్‌ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్‌ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్‌ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement