విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి..
గోపాల్‌పేట: కరెంటు కోతలతో పంట పొలాలకు నీరు పారడంలేదని పలు గ్రామాల రైతులు గోపాల్‌పేట విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో 18 గంటల కరెంటు వచ్చేదని.. ఇప్పుడు 12 గంటలు కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, విద్యుత్ ఏఈ సుధాకర్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ఏడీఈకి ఫోన్ చేయగా.. సానుకూలంగా స్పందించి కరెంటు సరఫరా చేయడంతో రైతులు శాంతించారు.
వనపర్తి రూరల్: వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ కూడా సరఫరా కావడం లేదంటూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలం నాచహళ్లి, కిష్టగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు నాచహళ్లి గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెబ్బేరు – వనపర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో పంటలకు సరిపడా నీరందక ఎండిపోతుండటంతో పాటు బోరుమోటార్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఇబ్బందులను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, రవిప్రకాశ్‌రెడ్డి, టీకే నాయక్, కిష్టగిరి సర్పంచ్ పద్మ వెంకటేశ్, నారాయణ, శంకర్‌నాయక్, బాలకృష్ణ, మహేశ్, అంజి, రూప్లానాయక్, గోవిందు నాయక్, తులసి, రామకృష్ణ, శ్రీను, ఆనంద్ పాల్గొన్నారు.
నాచహళ్లిలో ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు


