కోడె దూడలకు డిమాండ్
వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి.
నైపుణ్యం కలిగిన పశువులు..
మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది.
– హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు
నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట


