రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ దాడులు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ దాడులు ఆపాలి

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లులపై ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్న విజిలెన్స్‌ దాడులను వెంటనే ఆపాలని రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్‌ రఫీ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రైస్‌ మిల్లర్ల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్‌ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దశాబ్దాల నాటి నిబంధనలనే నేటికీ అమలు చేయడం సరికాదని, మారిన పరిస్థితులు, పెరిగిన ధరలకు అనుగుణంగా మిల్లింగ్‌ చార్జీలు, సీఎంఆర్‌ నిబంధనలను సవరించి మిల్లర్లకు ఏళ్లుగా చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలని, అందుకు మిల్లర్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం సీఎంఆర్‌ వందశాతం చెల్లించిన వారిపై ఫెనాల్టీ, వడ్డీని రద్దు చేయాలన్న మిల్లర్ల డిమాండ్ల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తూ మిల్లులను షట్‌డౌన్‌ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలోనే మిల్లర్లు ఐక్యంగా పోరాటంలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని కోరారు. వరికోతల సమయంలో అధికార, విపక్షం అనే తేడా లేకుండా ధాన్యం దించుకోవాలని ఒత్తిడి చేసే నాయకులు రోడ్డెక్కిన మిల్లర్ల సమస్య ఏమిటని అడిగిన దాఖలాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు అంటే దోపిడీ దొంగలుగా సమాజంలో చిత్రీకరించడం సరికాదని.. సీఎంఆర్‌ ఒప్పందాన్ని సవరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాంతంపై అభిమానం చూపుతున్నారని, అదేవిధంగా మిల్లర్లపై జరుగుతున్న దాడులను ఆపి ఆదుకోవాలని కోరారు. మిల్లర్లంతా ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు సోళీపురం శేఖర్‌రెడ్డి, కట్ట సుబ్బయ్య, నరేందర్‌, సంపత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement