వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపడుతున్న ఆందోళనలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. కార్మికులపై నిర్బంధ చర్యలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కార్మికులతో కలిసి సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 8, 9 తేదీల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ, హమాలీ కార్మికుల సమస్యలు ఆయన డిమాండ్ చేశారు. హమాలీ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు, బొబ్బిలి నిక్సన్, సునిత, బాలగౌడ్, రాజు, రాము, బుచ్చమ్మ, కవిత, గిరిజ, తిరుపతమ్మ, సుమతి, ఇందిర, అరుణ, హరికృష్ణ, శ్రీనివాస్, హనీఫ్, జయమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.


