నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్‌! | - | Sakshi
Sakshi News home page

నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్‌!

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

పాలన సూపర్‌ అంటే చాలు..

నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం..

మీ వెనుకే ఉంటాం అంటే అందలం..

ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్‌..

పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ

పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్‌ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌) గ్రూప్‌లుగా

చీలిపోగా.. అంతర్గత వార్‌ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి,

అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో

ప్రత్యేక కథనం..

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే..

పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్‌, కిషోర్‌కుమార్‌, నూర్జహాన్‌, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్‌ చంద్రకిరణ్‌కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్‌ మధుసూదన్‌రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ ఓఎస్‌డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఒక్కరికి 2, 3 బాధ్యతలు..

యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్‌ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్‌ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్‌ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పటి నుంచే దూరం..

వీసీగా శ్రీనివాస్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రార్‌గా చెన్నప్పను నియమించారు. ఆయన కొన్ని నెలలకే ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో ఓయూ ప్రొఫెసర్‌గా ఉన్న రమేష్‌బాబును తీసుకొచ్చి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇది యూనివర్సిటీలోని రెగ్యులర్‌ అధ్యాపకులను మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. పీయూలో సీనియర్లుగా ఉండి, గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కనబెట్టడంతో ఆ రోజు నుంచే పలువురు వీసీతోపాటు రిజిస్ట్రార్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గర ఉంచుకుని పీయూ పాలనా యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నాన్‌–టీచింగ్‌, దిగువ స్థాయి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

వీసీ, రిజిస్ట్రార్‌ తీరుపై విమర్శలు..

పీయూలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెగ్యులర్‌ అధ్యాపకులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒకలా, లేని వారితో మరోలా వ్యవహరిస్తున్నారని.. చాలా సమయం వీసీ చాంబర్‌ ఎదుట నిలబెట్టడం వంటివి చేస్తున్నారని కొందరు రెగ్యులర్‌ ప్రొఫెసర్లు బాధను వెళ్లగక్కారు. నచ్చకుంటే అన్నింటా తలదూర్చడమే కాకుండా అగౌరవ పరుస్తున్నారని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే పీజీ సెంటర్లకు బదిలీ చేస్తామని సైతం బెదిరిస్తున్నట్లు అధ్యాపక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన

సీనియర్లు, రెగ్యులర్‌ అధ్యాపకులపై వివక్ష

8 ప్రిన్సిపాల్‌ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్‌ లెక్చరర్లే..

ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు

అనుభవం ఉన్నా..

మిగతా వారికి మొండిచేయి

అందరికీ ప్రాధాన్యం ఇస్తాం

పోస్టుల కేటాయింపులో రెగ్యులర్‌ వారితో పాటు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. భవిష్య త్‌లో భర్తీ చేసే పోస్టుల్లో రెగ్యులర్‌ వారికి మరిన్ని పోస్టులు కల్పిస్తాం. ప్రస్తుతం పోస్టులు కేటాయించిన వారు పూర్తిస్థాయిలో పనిచేస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాంట్రాక్టు సిబ్బందికి అదనంగా ఉన్న బాధ్యతలను తగ్గిస్తాం.

– రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్‌

అధికారాలు కేంద్రీకృతం కావద్దు

పీయూలో వివిధ పోస్టులు ఒకే చోట కేంద్రీకరణ కావద్దు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్‌, సీనియర్లు, అనుభవం ఉన్న వారి సేవలను యూనివర్సిటీలో వినియోగించుకోవాలి. కానీ ఒక్కరికే, రెండు, మూడు పోస్టులు ఇస్తే ఎలా అడ్మినిస్ట్రేషన్‌ కొనసాగుతుంది. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

– రాము, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు, పీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement