వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

వనపర్తి: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలో ఎన్ని మండపాలకు అనుమతులు ఇచ్చారు.. నల్లచెరువు వద్దకు నిమజ్జనానికి ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం ఉందనే వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని వివరించారు. నిమజ్జనం రోజున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను విధుల్లో ఉంచాలని, వారికి తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు అందించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌, పోలీస్‌, మున్సిపల్‌ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

25వ తేదీ నాటికి టౌన్‌హాల్‌ ప్రారంభించాలి..

పాత మార్కెట్‌యార్డులో నిర్మించిన టౌన్‌హాల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి 25వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్‌ వెంట పుర కమిషనర్‌ నిరంజన్‌, విద్యుత్‌, పోలీసుశాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement