చిన్నన్న రహస్య భేటీ..? | - | Sakshi
Sakshi News home page

చిన్నన్న రహస్య భేటీ..?

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

హైదరాబాద్‌ శివారులో అసమ్మతి నేతలతో..

మీడియాకు దూరంగా ఉంటూనే మాజీలను ఏకం చేసేపనిలో ఉన్నారా..?

వనపర్తి: మాజీ మంత్రి, తాజా మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి గోపాల్‌పేట మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం వేదికగా చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకొని ఆయనపై వేటు వేయడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విధితమే. కాగా కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన మరోసారి రాష్ట్రస్థాయి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల హైదరాబాద్‌ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ అసంతృప్తు నేతలు కొందరితో రహస్య సమావేశం నిర్వహించి వారిని ఏకం చేసి అధిష్టానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో మరొకరిని నియమించడంతో స్వగ్రామంలో ఉంటూ పొలం పనులు చేసుంటూనే.. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే మనోవేదనతో ఉన్న వారిని ఒకేచోట చేర్చే యోచనతో ఈ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. 2004లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వనపర్తి వేదికగా 40 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసిన ఘటనను గుర్తు చేసేలా చిన్నన్న పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్టున్నారని పార్టీలో ఆయన సీక్రెట్‌ మీటింగ్‌ ఓ చర్చ లేవనెత్తేలా చేసింది.

మీడియాకు దూరంగా ఉంటూనే..

మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపిస్తూనే వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యర్థుల ఊహకందని విధంగా స్కెచ్‌ వేసి అధిష్టానానికి స్థానిక విషయాలను తెలియజేస్తూ.. తన మునుపటి వైభవాన్ని దక్కించుకొని తన క్యాడర్‌లో సన్నగిల్లుతున్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటని మీడియా వారు ప్రశ్నిస్తే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. ఏదైనా ఉంటే పిలిచి వెల్లడిస్తానంటూ దూరంగా ఉంటూనే తన ప్లానింగ్‌ను సీక్రేట్‌గా అమలు చేస్తున్నారనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రహస్య సమావేశానికి వనపర్తి నియోజకవర్గం నుంచి కొందరు ముఖ్యులు హాజరైనట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరూ సమావేశ విషయాలు బయట పడకుండా జాగ్రత్తలు పాటిస్తుండటం గమనార్హం.

తాజాగా పార్టీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పదవికి దూరమైన సంఘటన.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, 2023 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలతో టికెట్‌ దూరమైన సందర్భాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డినే చిన్నన్న తొలి ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారం కోసం వాల్‌రైటింగ్‌ రాసినట్లు పలు వేదికలపై చెప్పినా.. ఆయనకు పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

రెండోసారి ఘాటు వ్యాఖ్యలతో చేటు..

ఢిల్లీకి పయనమవుతున్నారా..?

పార్టీ, ప్రభుత్వానికి అంటిముట్టనుట్టుగా ఉంటున్న వారిని ఏకం చేసి అందరితో కలిసి ఢిల్లీకి పయనమై తమ వాదనలను అధిష్టానం వద్ద బలంగా వినిపించేందుకు చిన్నన్న సీక్రెట్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరి మద్దతుతో తమ వాదనలు బలంగా వినిపించేలా తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement