వనపర్తి: ఎస్‌ఐఆర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, పత్రాల సమర్పణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నో మ్యాపింగ్ లేదా అనామలీస్ నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న తేదీల్లో తప్పనిసరిగా విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలని.. వివరాలు పరిశీలించి తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రజలకు సరైన సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల రెండు దఫాలు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమంలో ఫారం–6, 7, 8కు సంబంధించి 2,177 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఆయా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రంజిత్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


