వనపర్తి రాజమహల్
వనపర్తి: సెప్టెంబర్ 17 అంటేనే నిజాం పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన రోజుగా అందరికీ తెలుసు కానీ.. నిజాం సార్వభౌమాధికార పరిధిలోని సామంతరాజుగా ఉన్న వనపర్తి మూడవ రాజా రామేశ్వర్‌రావు అంతకంటే ముందే తన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం లిఖించని చరిత్ర. వందేళ్ల క్రితమే.. వనపర్తి సంస్థానం చివరి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ప్రముఖుల్లో ఒకరుగా పేరొందారు. స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేస్తున్న విషయం తెలుసుకొని ముందస్తుగానే అప్పటి పాలకులతో విలీన ఒప్పందానికి సిద్ధం కాగా.. నిజాం పాలకులు వనపర్తి సంస్థానాధీశులపై గుర్రుగా ఉంటూ బందీని చేసేందుకు ప్రయత్నించారు. ఆయన అప్పటికే భారత ప్రభుత్వ రక్షణలో ఉండటంతో నిజాం సర్కారు సైన్యం వెనుదిరినట్లుగా ఇక్కడి వారు కథలుగా చెప్పుకొంటారు. ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ రాష్ట్రం సైతం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత ఆయన భారత ధౌత్యవేత్తగా ప్రభుత్వ ప్రతినిధిగా సేవలందించారు. అనంతరం కేంద్ర మంత్రిగా మహబూబ్‌నగర్ తొలి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై భారత విదేశాంగ మంత్రిగా సేవలందించారు. కానీ ఈ విషయాలు ఎక్కడా చరిత్రలో లిఖించలేదు. ఇప్పటికీ ఇంకా వనపర్తిలో ఆయన నెలకొల్పిన రాజారామేశ్వర్ ట్రస్ట్‌లో కొంత సమాచారం భద్రపర్చడంగమనార్హం. భారత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను వనపర్తికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువత కోసం సాంకేతిక విద్యాలయానికి తన రాజమహల్‌ను దానంగా ఇచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేయించారు. ఇప్పటికీ ఇంకా రాజ భవనంలోనే కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది.


