సాయుధ సమరంలో
మదనాపురం: 1947, ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరిగినా.. నైజాం ఉక్కుపాదం కింద నలిగిన తెలంగాణ గడ్డపై విముక్తి భానుడు ఉదయించలేదు. భరతమాత ఒడిలోకి నాటి నైజాం రాజ్యాన్ని విలీనం చేసేందుకు తెలంగాణ పల్లెపల్లెనా సాయుధ పోరాట జ్వాలలు ఎగిసిపడ్డాయి. రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు ఆయుధాలు చేతబట్టి నిజాం సైన్యం, రజాకార్లను ఎదుర్కొన్న సాయుధ సమరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మారేడుపల్లి (నేటి మదనాపురం) ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
● మదనాపురం అసలు పేరు మారేడుపల్లి. సాయుధ పోరాటానికి ముందు ఈ ప్రాంతం వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. ముంబై, గుజరాత్, చైన్నె, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం వ్యాపారులు ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకొని బియ్యం (రైస్ మిల్లులు), నూనె మిల్లులను నెలకొల్పారు. నాటి వ్యాపార సామ్రాజ్యమంతా వారి గుప్పిట్లోనే ఉండేది. అయితే 1948 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో సాయుధ పోరాటం తీవ్రస్థాయికి చేరింది. భూస్వామ్య విధానం, నిజాం అణచివేతకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించడంతో వ్యాపారులకు స్థానికంగా మద్దతు కరువైంది. రజాకార్ల అరాచకాలు, ప్రజాగ్రహం మధ్య తాము మనుగడ సాగించలేమని గ్రహించి 1948, సెప్టెంబర్ 17 విలీన ప్రక్రియకు ఆరు నెలల ముందే తమ మిల్లులు, ఆస్తులను ఉన్నఫలంగా వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. విలీనం పూర్తయిన అనంతరం వారు తిరిగొచ్చి తమ స్థిరాస్తులను స్థానికులకు విక్రయించి వెళ్లారని చరిత్ర చెబుతోంది.
నాడు వ్యాపారానికి ప్రధాన కేంద్రం
రైస్, నూనె మిల్లులు ఏర్పాటు..
భిన్న రాజ్యాల కరెన్సీ మార్పిడి కేంద్రం
తెలంగాణ విమోచన దినోత్సవ
ప్రత్యేక కథనం


