వనపర్తి: ఆధ్యాత్మిక, ఆయుర్వేద, ప్రాచీన చరిత్రకు సంబంధించిన చేతిరాతలు సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధ్యక్షతన జిల్లా కమిటీ ఏర్పాటైంది. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు తమ ఇళ్లలో భద్రపర్చుకున్న ప్రాచీన చేతిరాతలు, ఆలయాలు, మఠాలు, దర్గాల్లోని వారసత్వ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు తదితర చేతిరాతలను గుర్తించి వాటిని డిజిటలైజేషన్ చేసి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సభ్యులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థుల ద్వారా చేతిరాతల వివరాలు సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలను ముందుగా సేకరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరేందర్‌కుమార్, ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ సునీత, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.


