చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

వనపర్తి: ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు చాకలి ఐలమ్మ చూపిన తెగువను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌తో ముఖ్యఅతిథులుగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా నిలిచి భూస్వామ్య దోపిడీ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి, ఆత్మవిశ్వాసంతో అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు ఐలమ్మ జీవితం స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ఆమె చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్తలు రాజారాం ప్రకాష్‌, గంధం నాగరాజు చాకలి ఐలమ్మ జీవితంపై పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి ప్రమీల, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement