వదంతులు సృష్టిస్తే కటకటాలకే.. : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

వదంతులు సృష్టిస్తే కటకటాలకే.. : ఎస్పీ

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

మదనాపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాజిక మాధ్యమాలు వేధికగా వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తిచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. సైబర్‌ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిసెప్షన్‌ కేంద్రాన్ని సందర్శించి బాధితులతో సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే వారికి పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసుల పురోగతిని సమీక్షించి పాత నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తుల వివరాలు సేకరించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పెంచి ఈవ్‌టీజింగ్‌, చోరీలు, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం వినాయక నిమజ్జన ప్రధాన ప్రదేశాలైన సరళాసాగర్‌, రామన్‌పాడ్‌, కొత్తపల్లి వంతెన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల నుంచి నిమజ్జన ప్రదేశాల వరకు నిరంతర నిఘా కొనసాగాలని.. మద్యం తాగి వాహనాలు నడపడం, ర్యాష్‌ డ్రైవింగ్‌, ఆకతాయి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఆమె వెంట డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు, కొత్తకోట, వనపర్తి సీఐలు శివకుమార్‌, ఓడీ రమేష్‌, సుగంధ రత్నం, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్‌, ఎస్‌ఐ జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement