వనపర్తి: రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ భద్రతా చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల ఎస్పీలు, పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి ఎస్పీ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగినస్థాయిలో పోలీసు బందోబస్తు కల్పించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో చిన్నపాటి ఘటనలు సైతం పెద్ద సమస్యలకు దారితీయకుండా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. నిమజ్జనాలపై దృష్టి సారించి ఆయా మార్గాలు, చెరువులు, జలాశయాల వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, శివకుమార్, ఓడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


