కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట | - | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

వనపర్తి రూరల్‌: శ్రావణమాసం చివరి శనివారం కావడంతో మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన శ్రీ తిరుమలనాఽథస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకుడు కురుమూర్తి ఉదయం అభిషేకం, అలంకరణ తదితర ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారికి దర్శించుకోగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర స్పోర్స్‌ అథారిటీ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు వేదాశీర్వచనం చేయగా.. నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. దాతలు గుట్ట కింద అన్నప్రసాద వితరణ చేపట్టారు. వాహనాల రద్దీ పెరగడంతో ఘాట్‌ రోడ్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ హృశికేష్‌ సిబ్భందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకుడు కిష్టగిరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌’

వనపర్తి: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హేమంత్‌ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ శనివారం జిల్లాకేంద్రంలో విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, యూత్‌ కమిషన్‌, రూ.10 లక్షల వడ్డీలేని రుణ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను తక్షణం విడుదల చేయాలన్నారు. విదేశీ విద్యకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే జీఓనంబర్‌ 97ను రద్దు చేయాలని, యూత్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వనపర్తి ఇన్‌చార్జ్‌ సూర్యవంశం గిరి, బీఆర్‌ఎస్వీ సోషల్‌ మీడియా ఇన్‌న్‌చార్జి సునీల్‌ వాల్మీకి, శివగౌడ్‌, సిరివాటి శంకర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ ఉంగ్లం తిరుమల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో

ప్రసవాల సంఖ్య పెంచాలి

వనపర్తి రూరల్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్‌ సూచించారు. శనివారం పెబ్బేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ, ప్రసవాలు, ఇన్‌పేషెంట్ల రికార్డులను పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా ప్రబలుతున్నాయని, నియంత్రణకు ప్రతి శుక్ర, మంగళవారం పట్టణంతో పాటు గ్రామాల్లో డ్రై డే నిర్వహించి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్‌ అధికారుల కొరత ఉన్నందున ఇద్దరిని నియమించామని, త్వరలోనే వైద్యులను నియమిస్తామని తెలిపారు. ఆయన వెంట వైద్యురాలు సుధారాణి, విస్తరణ అఽధికారి దామోదర్‌, నర్సింగరావు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పార్వతి, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌, ఫార్మసీస్ట్‌ కుమారి, నర్సింగ్‌ అధికారి లక్ష్మి, విక్టర్‌ రాజు, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement