ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

వనపర్తిటౌన్‌: విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని.. సమాజం ఎల్లప్పుడూ గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ తొలి గురువు, తర్వాత సరైన దిశను చూపించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. తల్లి ప్రేమతో పిల్లలకు తొలి జీవిత పాఠాలు నేర్పితే.. ఉపాధ్యాయులు విద్యాబుద్ధులతో పాటు సమాజాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అందిస్తారన్నారు. కేవలం పాఠ్యాంశాలను బోధించేవారు మాత్రమే కాదని.. మంచి చెడులను గుర్తించే విచక్షణ, క్రమశిక్షణ, బాధ్యత, మానవత్వం వంటి విలువలను పెంపొందిస్తారని పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అవసరమని.. గురువుల ప్రోత్సాహం, మార్గనిర్దేశంతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగగలరన్నారు. తల్లిదండ్రుల కష్టాలు, త్యాగాలను విద్యార్థులకు తెలియజేసి వారిలో గౌరవభావాన్ని పెంపొందించడంలో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇంట్లో అమ్మ, నాన్న జీవితానికి పునాది వేస్తే.. పాఠశాలలో గురువులు ఆ పునాదిపై విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మిస్తారని పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణనన్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువుల గొప్పతనానికి నిదర్శనమన్నారు. అంతకుముందు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 55 మందిని సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్య, పుర వైస్‌ చైర్మనన్‌ మధుసూదన్‌గౌడ్‌, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement