వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని.. రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా.. నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పెబ్బేరు, ఖిల్లాఘనపురంలో నిర్వహించిన రైతు నిరసన సభలకు ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో విధ్వంసానికి గురైందని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని.. 33 నెలల కాలంలో రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. 20 లక్షల మందికి కూడా పూర్తిస్థాయిలో చేయకుండా మోసం చేశారన్నారు. నేడు సాగునీరు, యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. రైతుబీమా ప్రీమియం చెల్లించి అన్నదాతలను ఆదుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసురావడం లేదన్నారు. గణప సముద్రం, బుద్దారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చి పరిహారం వచ్చేలా చేసింది కేసీఆర్ అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రూ.4.50 లక్షల కోట్ల అప్పుచేసి రికార్డు సృష్టించారని, సీఎంపై ఆయన మంత్రివర్గానికే విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు.. మనకు ఉట్టి మాటలు అన్న చందంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా.. అభివృద్ధి ఎవరు చేశారనేది మున్ముందు ప్రజలు గుర్తిస్తారన్నారు. పెబ్బేరులో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వనం రాములు, దిలీప్‌కుమార్‌రెడ్డి, నాయకులు కర్రెస్వామి, ఎద్దుల కరుణశ్రీ, పలుస శంకర్‌గౌడ్, రాజశేఖర్, హరిశంకర్‌నాయుడు, ఖిల్లాఘనపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


