వనపర్తిటౌన్: రోస్టర్ పాయింట్ల అమలుపై స్పష్టత వచ్చే వరకు పదోన్నతి ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా విద్యుత్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పూల్యానాయక్, ప్రధానకార్యదర్శి ఆర్.దయానందం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట జిల్లా విద్యుత్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ల అంశంపై నాలుగు నెలల కిందటే డీఈకి సంఘం తరఫున లేఖ అందజేసినా ఇప్పటి వరకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదన్నారు. రోస్టర్ పాయింట్లను పరిగణలోకి తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతోనే ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.


