● జిల్లాకేంద్రంలో 30కి పైగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు
● మహిళలతో కిటకిట..
రూ.5 నుంచి రూ.600 వరకు
వనపర్తిటౌన్: రాఖీపౌర్ణమిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో బుధవారం రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. పట్టణంలోని గాంధీచౌక్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, రాజీవ్ చౌక్, బస్సు డిపో రోడ్, బస్టాండ్, ప్రజా వైద్యశాల రోడ్, పొట్టి శ్రీరాములు చౌరస్తా తదితర ప్రాంతాల్లో 30కి పైగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇవేగాక పలు దుకాణాల ఎదుట ప్రత్యేకంగా రాఖీ విక్రయాలు జరుపుతున్నారు. వెండి, సిల్వర్ కోటెడ్, బిగ్‌బాస్ ఐకాన్, సలార్ మూవీ ఐకాన్, అన్నయ్య తదితర వివిధ రకాల రాఖీలు విక్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.600 వరకు రాఖీలు అందుబాటులో ఉండగా.. జిల్లాకేంద్రంతో పాటు పరిసరాల నుంచి మహిళలు, యువతులు తరలిరావడంతో స్టాళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. అదేవిధంగా పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్ తదితర పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ రాఖీల కొనుగోలు సందడి కనిపించింది.
విభిన్న ఆకృతుల్లో..
ఈసారి రంగురంగుల డిజైన్లతో పాటు విభిన్న ఆకృతులు, ప్రత్యేక నమూనాల రాఖీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతులు తమ సోదరులకు నచ్చేలా ఆకర్షణీయ డిజైన్లను పరిశీలిస్తూ రాఖీలను ఎంపిక చేసుకుంటున్నారు. చిన్నారులు, యువత కోసం కార్టూన్ బొమ్మలు, సినిమా, టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆకృతులతో కూడిన రాఖీలను కూడా విక్రయానికి ఉంచారు. సాధారణ రాఖీల నుంచి ఖరీదైన సిల్వర్, సిల్వర్ కోటెడ్ రాఖీల వరకు ధరల్లో తేడా ఉండటంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు.
పుర కేంద్రానికి చెందిన కడియాల వెంకటన్నకు 93 ఏళ్లు. ఈయనకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. అక్క, రెండో చెల్లెలు మృతిచెందగా.. చిన్న చెల్లెలు కళావతమ్మకు ప్రస్తుతం 84 ఏళ్లు. ఆమె 76 ఏళ్లుగా ప్రతి రాఖీపండుగకు వచ్చి తన అన్నకు రాఖీ కడుతోంది. అన్నకు ఆమె ఆప్యాయంగా మిఠాయి తినిపిస్తే.. అందుకు అన్న చెల్లికి కానుక ఇస్తారు. కళావతమ్మకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా.. ఇద్దరు కుమారులు మృతిచెందారు. ప్రస్తుతం ఆత్మకూర్‌లోని పెద్దకుమార్తె తేజవతమ్మ వద్ద ఉంటోంది. వెంకటన్నకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె మృతిచెందగా ఆత్మకూర్‌లోని చిన్న కుమార్తె వద్ద ఉంటున్నారు. – ఆత్మకూర్
అన్నాచెల్లెలి అనుబంధానికి 76 ఏళ్లు..


