● జిల్లాలోని రైస్‌మిల్లుల్లో కొనసాగుతున్న విజిలెన్స్ దాడులు
ఖిల్లాఘనపురం: సీఎంఆర్ బకాయిల్లో జిల్లా రెండోస్థానంలో ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రైస్‌మిల్లులు రెండింటిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌరసరఫరాలశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం–2 అధికారులు పౌరసరఫరాలశాఖ డీటీ పరమేశ్వర్, ఈటీఎఫ్ సీఐ పండరి, ఎస్సైలు సాంబశివుడు, వెంకటేష్‌తో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు అధికారులు లెక్కలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఓ రైతు ఫిర్యాదు మేరకు మండల కేంద్రంలోని శ్రీదేవికి చెందిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రైస్‌మిల్లులు రెండింటిలో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. సీఎంఆర్ బకాయిల్లో రూ.500 కోట్లతో సూర్యాపేట జిల్లా ముందువరుసలో ఉండగా రూ.474 కోట్లతో వనపర్తి జిల్లా రెండోస్థానంలో నిలిచిందన్నారు. బకాయిలు చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇచ్చినప్పటికీ చాలామంది మిల్లర్లు అప్పగించకపోవడంతో ప్రభుత్వం తనిఖీలకు ఆదేశాలిచ్చిందని తెలిపారు. రెండు రైస్‌మిల్లుల్లో నాలుగు సీజన్లకు సంబంధించిన ధాన్యం బస్తాల లెక్క తేలాల్సి ఉందన్నారు. తనిఖీలు పూర్తిచేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కనిపించని రైస్‌మిల్లుల యజమాని..
తనిఖీల విషయం ముందే తెలుసుకున్న మిల్లు యజమానితో పాటు కుటుంబ సభ్యులు ఉండకుండా వెళ్లిపోయారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లా అఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ రాంబాబు హుటాహుటిన ఖిల్లాఘనపురం చేరుకొని ఎస్‌ఐ వెంకటేశ్‌తో పాటు పోలీస్ సిబ్బందిని ఎక్కడున్నది ఆరా తీయాలని ఆదేశించడంతో వారు వెళ్లారు. తర్వాత రైస్‌మిల్లుల గేట్ మూసివేసి తనిఖీలు చేపట్టారు. చివరి సమయంలో విలేకర్లను అనుమతించారు.
పెద్దగూడెంలోనూ..
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ (రైసు మిల్లు)పై శుక్రవారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయ్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. సీఐ గణేష్, కరుణాకర్, జీఎస్‌టీఓ సురేష్, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేశారు. 2022–23 నుంచి 2024–25 వరకు యాసంగి సీజన్‌లో కేటాయించిన వరి ధాన్యం బస్తాలను లెక్కించారు. 2022–23లో 2,545 మెట్రిక్ టన్నులు, 2023–24లో 1,321 మెట్రిక్ టన్నులు, 2024–25లో 260 మెట్రిక్ టన్నులు.. మొత్తం 4,126 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా వచ్చిందన్నారు. దీని విలువ దాదాపు రూ.10.10 కోట్లని వారు తెలిపారు.


