ఖిల్లాఘనపురం: మండలంలోని హన్‌పాడ్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్‌మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్‌మిల్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.52 కోట్ల విలువైన వరి ధాన్యం మాయమైనట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. రెండు మిల్లులకు 2022–23, 2024–25 యాసంగి, 2025–26 వానాకాలం, యాసంగి సీజన్ల వరి ధాన్యం ఆయా మిల్లులకు కేటాయించామని.. ఆ ధాన్యం పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని వివరించారు. బాయిలర్ రైస్‌మిల్లులో 1,49,198 బస్తాలు వీటి విలువ రూ.31 కోట్లు, రా రైస్‌మిల్లులో 2,01,985 బస్తాలు విలువ రూ.21 కోట్ల వ్యత్యాసం ఉందన్నారు. మొత్తం 3,51,183 బస్తాలు.. విలువ రూ.52 ఽకోట్లని డీఎస్‌ఓ చెప్పారు. ఆయా మిల్లుల యజమానురాలు ఎస్.శ్రీదేవిపై శనివారం సాయంత్రం ఖిల్లాఘనపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రైసుమిల్లు యజమానురాలిపై కేసునమోదు..
వనపర్తి రూరల్: జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు ఫిర్యాదు మేరకు మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ రైసుమిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్‌ఐ హృశికేష్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కథనం మేరకు.. భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ (రైసుమిల్లు)కు 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం, 2024–25 వానాకాలం, యాసంగి సీజన్‌లో ప్రభుత్వం వరి ధాన్యం కేటాయించింది. శుక్రవారం రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా 1,03722 సంచుల ధాన్యం తక్కువగా ఉందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.14 కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. శనివారం మిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.


