అనామలిస్‌ జాబితాలో 74,462 ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

అనామలిస్‌ జాబితాలో 74,462 ఓటర్లు

Aug 23 2026 5:38 AM | Updated on Aug 23 2026 5:38 AM

వనపర్తి: ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 74,462 మంది ఓటర్ల పేర్లు అనామలిస్‌ జాబితాలో ఉన్నాయని, అదేవిధంగా బీఎల్వోల ద్వారా మ్యాపింగ్‌ కానివారు 12,027 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. మొత్తం 86,489 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్‌పై ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. 2002 ఓటరు జాబితాలో ఉన్న పేరుకు ప్రస్తుత ముసాయిదా జాబితాలో ఉన్న పేరులో అక్షర దోషం, సర్‌ నేమ్‌, వయస్సులో తేడాలున్నా.. చిన్న చిన్న దోషాలున్నా.. వారిని అనామలిస్‌ జాబితాలో నమోదు చేసినట్లు చెప్పారు. అలాంటి వారికి నోటీసులిచ్చి వారి వద్ద నుంచి తగిన ఆధారాలు తీసుకొని వెంటనే అప్‌లోడ్‌ చేసి జాబితా నుంచి పేరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇందుకు బీఎల్వోలకు శిక్షణ ఇవ్వాలని ఏఈఆర్వోలను ఆదేశించారు. నో మ్యాపింగ్‌ జాబితాలో పేర్లు ఉన్నవారికి సైతం నోటీసులిచ్చి తగిన ఆధారాలు తీసుకోవాలని.. ఒకరోజు హియరింగ్‌కు పిలిచి వారు భారత పౌరులమని నిరూపించుకునే విధంగా అవకాశం కల్పించి తగిన ఆధారాలతో ఆన్‌లైనలో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. భారతీయ పౌరుడిగా రుజువు చేసుకునేందుకు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డుతో పాటు ఆధార్‌కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. హియరింగ్‌ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేది నోటీసులో పేర్కొంటారన్నారు. నో మ్యాపింగ్‌ జాబితాలో ఉన్న వారు 1984, జూన్‌ 1 కంటే ముందు జన్మించిన వారైతే గుర్తింపుకార్డు సమర్పిస్తే సరిపోతుందని.. 1984 తర్వాత జన్మించిన వారు వారి గుర్తింపుకార్డుతో పాటు తన తల్లి, తండ్రి గుర్తింపుకార్డు ఆధారంగా చూపించాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కు మార్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement