ఎస్‌జీఎఫ్‌లో.. క్రీడల సందడి! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌లో.. క్రీడల సందడి!

Aug 22 2026 12:30 AM | Updated on Aug 22 2026 12:30 AM

టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తాం

రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్‌నగర్‌ నుంచి ప్రతిపాదనలు

అండర్‌–14, 17, 19 విభాగాల్లో పోటీలు

అండర్‌–17 బాలికల జాతీయ క్రికెట్‌ టోర్నీకి ప్రతిపాదన

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) పోటీలకు మహబూబ్‌నగర్‌ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ టోర్నీలతోపాటు అండర్‌–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరోసారి ఎస్‌జీఎఫ్‌ క్రీడల సందడి నెలకొననుంది.

ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్‌–17 బాల, బాలికల కబడ్డీ, అండర్‌–17, అండర్‌–19 బాల, బాలికల వాలీబాల్‌, క్రికెట్‌, అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 బాల, బాలికల హ్యాండ్‌బాల్‌, అండర్‌–19 బాల, బాలికల నెట్‌బాల్‌, అండర్‌–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్‌జీఎఫ్‌ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు.

ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్‌నగర్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌ చివర్లో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ పట్టణాల్లో అండర్‌–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్‌–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్‌ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది.

జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ క్రీడల నిర్వహణకు సంబంధించి డీఈఓ ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీన మహబూబ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో పీడీ, పీఈటీల సమావేశం నిర్వహిస్తాం. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ టోర్నీలు, ఒక బాలికల జాతీయస్థాయి క్రికెట్‌ టోర్నీ నిర్వహించడానికి ప్రతిపాదనలు ఇచ్చాం. జిల్లాకు ఏ టోర్నీ కేటాయించినా విజయవంతంగా నిర్వహిస్తాం.

– వేణుగోపాల్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా

కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement