బల ప్రదర్శనకు
దిగుతున్న నేతలు..
నియోజకవర్గ చరిత్రలో
ఇదే ప్రథమం..
● పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే..
వర్గపోరుతో ప్రజల్లో పలుచన
● రాష్ట్ర, దేశ రాజధానికి చేరిన పంచాయితీ
● ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు
చేసిన ఎమ్మెల్యే
● గాంధీభవన్‌కు చిన్నారెడ్డి, అతడి అనుచరులు
వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాల చిచ్చు చిలికి చిలికి గాలివానలా మారింది. గోపాల్‌పేటలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం వేధికగా మొదలైన వివాదం కాస్తా రాష్ట్ర, దేశరాజధాని వరకు చేరింది. శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానాన్ని, పీసీసీని, తనను ధూషిస్తూ చేసిన అనుచిత వాఖ్యలపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు అందజేశారు. 30 నెలలుగా సొంత పార్టీ, తనపై చేసిన కామెంట్స్, కాంగ్రెస్ ఇచ్చిన పదవితో బీఆర్‌ఎస్ శ్రేణులతో అంటగాగుతూ ప్రతిపక్షాల నాయకులకు పనులు చేసి పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొని అందజేసి స్థానిక పరిస్థితులను వివరించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అనుచరవర్గం శుక్రవారం సుమారు 200 మందితో రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్ ఎదుట బైఠాయించి ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భయాందోళనలో పార్టీ శ్రేణులు..
పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని సంతోషం లేకుండా నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు మొదటి నుంచి ఉప్పు.. నిప్పుగా ఉండటం, ఇటీవల మొదలైన వివాదం తారాస్థాయికి చేరడం పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎవరి వెంట ఉంటే ఎవరికి కోపం వస్తుందో.. కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డి ఎవరికి మద్దతుగా ఉంటారో తెలియక బిక్కుబిక్కుమంటోంది. దశాబ్దాలుగా చిన్నారెడ్డి వెంట ఉన్న కొందరు నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు ఇచ్చే సమయంలో ఉండటం.. మరికొందరు చిన్నారెడ్డికి మద్దతు తెలియజేస్తూ.. బాహటంగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంతో నియోజవర్గ కాంగ్రెస్ రెండుగా చీలిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరించినా.. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వనపర్తి కాంగ్రెస్‌లో రేగిన చిచ్చుతో క్యాడర్ రెండుగా చీలింది. ఫిర్యాదులు చేసేందుకు వెళ్తూ.. తమ బలాన్ని చూపేందుకు శ్రేణులను పెద్దమొత్తంలో గాంధీభవన్‌కు తీసుకెళ్లి ఆందోళనలు చేస్తుండటం గమనార్హం. అధికార పక్షం కుమ్ములాడుకుంటూ పలుచనైతే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
1951లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. 74 ఏళ్లలో రెండుసార్లు నిర్వహించిన ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో పదిసార్లు కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన వారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాని సొంత పార్టీలో ముసలం పలుచన చేస్తూ ప్రధాన నాయకులే అధిష్టానికి ఫిర్యాదులు చేసిన ఘటన ఇదే ప్రథమమని చెప్పువచ్చు.


