జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన వారికి మలేరియా, డెంగీ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, అదేవిధంగా ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడంతో పాటు పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పార్క్‌లను గుర్తించి అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీలో ఆయన పర్యటించి ఆరోగ్య సిబ్బంది ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఇళ్లలో నిల్వ నీరు ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా నిల్వ నీటిని తొలగించడం, పారిశుద్ధ్య చర్యలు నిరంతరం చేపట్టాలని సూచించారు. కాలనీలోని మున్సిపల్ పార్క్‌ను పరిశీలించారు. అవసరమైన మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని, అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి నోచుకోని నిరుపయోగంగా ఉన్న పార్క్‌లను గుర్తించి నివేదిక సమర్పించాలని పుర అధికారులను ఆదేశించారు. అనంతరం కేడీఆర్‌నగర్‌లోని బస్తీ దవాఖానాను సందర్శించి ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పాము, కుక్క కాటు బాధితులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి భాస్కర్‌నాయక్, కౌన్సిలర్ పరశురాం, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు.


