బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

వనపర్తి: బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ ప్రత్యేక చొరవతో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నుంచి విముక్తి పొందిన 54 మంది బాలికలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఇద్దరు ఎస్‌ఐలు, వైద్యులతో బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ.. జీవితంలో ఎదురైన పరిస్థితులు భవిష్యత్‌ను నిర్ణయించకూడదని, బాలికలు చదువుకోవడంతో పాటు నచ్చిన నైపుణ్యాల్ని నేర్చుకొని సొంత కాళ్లపై నిలబడాలని అందుకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహం అనేది కుటుంబ సమస్యగా చూసే విషయం కాదని.. బాలిక హక్కులు, ఆరోగ్యం, విద్య, భవిష్యత్‌ను ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక సమస్య అన్నారు. తల్లిదండ్రులు కూడా బాలికలపై పెళ్లి ఒత్తిడి తీసుకురాకుండా వారి కలలను అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరారు. బాల్య వివాహం నుంచి విముక్తి పొందిన కొందరు బాలికలు తమ అనుభవాలను పంచుకున్నారు. పెళ్లి ఆపిన సమయంలో కుటుంబ సభ్యులు బాధపడ్డారని.. ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయామని, బాల్య వివాహం జరిగి ఉంటే తమ జీవితాలు ఎలా ఉండేవని తెలుసుకున్నామని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. మీకు పోలీసుశాఖ అండగా ఉందంటూ వారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఎస్పీ శాలువాతో సన్మానించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సరైన వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేయడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని తెలిపారు. అనంతరం చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రీ భారత్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, జగన్మోహన్‌, అంజద్‌, హైమా, భరోసా, షీటీం బృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement