వనపర్తి: క్రీడలు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప సాధనంగా ఉపయోగపడతాయని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బౌరంపేట్‌లో మిషన్ స్కేటింగ్ అకాడమీ, పూణే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక 80 నిమిషాల నాన్‌న్‌స్టాప్ స్కేటింగ్ ఈవెంట్‌లో జిల్లాకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొని జాతీయస్థాయి రికార్డు సాధించారు. మంగళవారం ఆయా చిన్నారులతో పాటు కోచ్ రాథోడ్ కిషన్, నిర్వాహకులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాన్ని తెలియజేశారు. అలాగే కార్యాలయ ప్రాంగణంలో స్కేటింగ్ విన్యాసాలను ప్రదర్శించగా ఎస్పీ తిలకించి మాట్లాడారు. చిన్న వయస్సులో చక్కటి ప్రతిభతో జాతీయస్థాయి రికార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. 80 నిమిషాల పాటు నిరంతరాయంగా స్కేటింగ్ చేయడం సాధారణ విషయం కాదని.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ జగన్మోహన్, స్కేటింగ్ కోచ్ కిషన్, చిన్నారుల తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


