జాబితాలో మీ పేరుందా..! | - | Sakshi
Sakshi News home page

జాబితాలో మీ పేరుందా..!

Aug 18 2026 1:03 AM | Updated on Aug 18 2026 1:03 AM

అచ్చంపేట: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌)–2026 ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్‌ బూత్‌ల వద్ద జాబితా ప్రదర్శించారు. మృతిచెందిన వారితోపాటు శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓట్లు కలిగిన వారిని జాబితా నుంచి తొలిగించారు. బీఎల్‌ఓలు 45 రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఓటర్లకు అందించి.. పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి.. ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్‌ చేశారు. ప్రస్తుతం వెలువడిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. లేదా.. అని వెతికే పనిలో ఓటర్లు పడ్డారు.

సరి చూసుకోకపోతే..

ఉమ్మడి జిల్లాలో సర్‌ ప్రక్రియకు ముందు 32,35,733 మంది ఓటర్లు ఉండగా.. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 27,72,578 మంది ఓటర్ల పేర్లను బీఎఓలు డిజిటలైజేషన్‌ చేశారు. వీరి పేర్లను మాత్రమే ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఫారాలు తిరిగి ఇవ్వని, అన్‌ కలెక్టబుల్‌ (అబ్సెంట్‌), పర్మనెంట్‌ షిఫ్ట్‌, డెత్‌, డూప్లికేట్‌ (ఎఎస్‌డీడీ) 4,63,155 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ప్రచురించారు. ముసాయిదా జాబితాలో ఉండే 8,84,030 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు (అనామలిస్‌) కలిగి ఉండటం, మ్యాపింగ్‌ జరగకపోవడంతో వారిని అనుమానాస్పద ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరికీ అక్టోబరు 15 వరకు ఎలక్ట్రోరల్‌ రిజిస్టర్‌ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించిన 4,63,155 మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లు కలిపితే 13,47,185 మంది జాబితాలో తమ పేరు తొలిగింపు ముప్పు ఎదుర్కోనున్నారు. నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లలో 1,21,434 మంది అన్‌మ్యాప్డ్‌ ఓటర్లు ఉండగా.. మిగిలిన 7,62,596 మంది ఓటర్లలో వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/ తల్లిదండ్రులు/ వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్‌ ఫారంలో పూరించాల్సి ఉండగా.. ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన/ లేక తప్పుడు వివరాలు ఇచ్చిన 1,21,434 మంది ఓటర్లను అన్‌ మ్యాప్డ్‌గా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఎన్యూమరేషన్‌ ఫారంలోని సర్‌–2002 ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పడం లేదు.

తస్మాత్‌ జాగ్రత్త..

ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు స్థానికంగానే ఉండి జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్లు కచ్చితంగా తమ పేరు ఉందో.. లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని.

ముసాయిదా ఓటరు జాబితా విడుదల

ఉమ్మడి జిల్లాలో 4,63,155 మంది ఓట్ల తొలగింపు

32.35 లక్షల నుంచి 27.72 లక్షలకు తగ్గిన సంఖ్య

ముసాయిదాలో పేర్లున్న 8.84 లక్షల మందికి నోటీసులు

గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ.. అభ్యంతరాలు, అప్పీల్‌కు నెలరోజుల గడువు

నమోదుకు మరో అవకాం..

ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయింలు, అభ్యంతరాలపై అందే దరఖాస్తులను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అలాగే అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతతోపాటు ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వారు నిబంధనల ప్రకారం ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫారం–7, ఓటరు పేరు, చిరునామా, ఛాయాచిత్రం తదితర వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం–8 వినియోగిస్తారు. వచ్చిన క్లెయింలు, అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబరు 19న తుది జాబితా ప్రచురిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement