2,37,006మంది ఓటర్లతో ముసాయిదా జాబితా | - | Sakshi
Sakshi News home page

2,37,006మంది ఓటర్లతో ముసాయిదా జాబితా

Aug 18 2026 1:03 AM | Updated on Aug 18 2026 1:03 AM

వనపర్తి: జిల్లాలో 2,37,006 ఓటర్లతో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. జాబితాలో పేర్లు లేని వారితో పాటు, పేర్లలో మార్పులు, చేర్పులు, చిరునామా మార్పు కోసం సెప్టెంబర్‌ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) టి.వినోద్‌కుమార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో విడుదలచేసిన ముసాయిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రకటించడమే కాకుండా, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూన్‌ 15వ తేదీ నాటికి జిల్లాలో 2,75,570 ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం విడుదలచేసిన ముసాయిదా జాబితాలో 2,37,006 ఓటర్లు నమోదైనట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 38,564 మంది ఓటర్లు తక్కువగా నమోదయ్యారని తెలియజేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు రాని వారందరికీ ఈఆర్వో ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుందని.. వారు తగిన ఆధారాలతో రుజువు చేసుకుంటే తుది జాబితాలో పేరు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 1984 జూలై 1 కంటే ముందు జన్మించిన వారు ఉంటే.. వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1984 నుంచి 2007 మధ్యలో జన్మించిన వారు తన గుర్తింపు కార్డుతో పాటు తన తల్లి లేదా తండ్రి గుర్తింపు కార్డు ఆధారంగా చూపించాల్సి ఉంటుందన్నారు. 2007 తర్వాత పుట్టిన వారు తన గుర్తింపు కార్డుతో పాటు తన తల్లి లేదా తండ్రి ఇద్దరి గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అదే విధంగా అక్టోబర్‌ 10వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు పూర్తిచేసుకున్న యువతీ యువకులు సైతం ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉన్నా.. డబుల్‌ పేర్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే ఫారం–7 ద్వారా పేరు తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో లేదా https:// voters.eci.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు వచ్చిన అన్ని ఫిర్యాదులను అక్టోబర్‌ 15వ తేదీలోగా పరిష్కరించి.. 19న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement