వీపనగండ్ల/పాన్‌గల్: రైతుల ప్రయోజనాలను విస్మరించి.. స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై రైతులు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం వీపనగండ్ల, పాన్‌గల్ మండలాల్లో ఆయన పర్యటించి.. భీమా, కేఎల్‌ఐ కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి కాల్వల మరమ్మతుపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. పాన్‌గల్ మండలంలో రామన్నగట్టు రిజర్వాయర్ మరమ్మతుతోనే సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈసారి ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వదలడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. భీమా, జూరాల కాల్వలకు యుద్దప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి, ఆయకట్టు పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కమలేశ్వర్‌రావు, మల్లయ్యయాదవ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వీరసాగర్, సత్యనారాయణగౌడ్, సర్పంచులు కృష్ణ, కోట్ల రాములు, ప్రవీణ్, పార్వతమ్మ, కిషోర్ నాయక్, బాలరాజు, నాయకులు సుదర్శన్‌రెడ్డి, బాలస్వామి, వేణుమాధవరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, జ్యోతినందన్‌రెడ్డి, తిలకేశ్వర్‌గౌడ్, వెంకటయ్యనాయుడు, రాజేశ్వర్‌రెడ్డి, దశరథ నాయుడు పాల్గొన్నారు.


