వనపర్తి: నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం అదనపు కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుతో కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ నీటితో సాగుచేసే పంటల ద్వారా నీటి వనరులను ఆదా చేయడంతో పాటు రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చన్నారు. అదే విధంగా కందులు – మినుములు, ఆముదం – మినుములు, మొక్కజొన్న – మినుములు వంటి అంతర పంటల సాగును రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ.. నీటి లభ్యత, నేల పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, డీఎల్‌పీఓ రఘునాథ్, హౌసింగ్ పీడీ విఠోబా పాల్గొన్నారు.


