ఆయకట్టు.. ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టు.. ఆందోళన

Aug 12 2026 12:46 AM | Updated on Aug 12 2026 12:46 AM

ఆరుతడి పంటలకే సాగునీరుసరఫరా అంటున్న అధికారులు

ఇప్పటికే జూరాలకు తగ్గిన వరద.. క్రస్ట్‌గేట్లు మూసివేత

నేడు వనపర్తి కలెక్టరేట్‌లో ఐఏబీ సమావేశం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకుపైగా వరి సాగు

మూడున్నరేళ్ల తర్వాతఐఏబీ సమావేశం..

సాగునీటి లభ్యత, పంటల ప్రణాళిక, ఆయకట్టు ప్రాంతాలకు నీటి కేటాయింపులు, వినియోగంపై మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందు ఐఏబీ (ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పాలకులు మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తలేదు. ఎల్‌నినో ప్రభావంతో సమస్య తీవ్రతరమైన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఐఏబీ సమావేశాలను పునరుద్ధరించి.. ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు, ఇప్పటి వరకు సాగుచేసిన పంటల వివరాలు, పంటకాలం ముగిసే వరకు సరిపడా నాటి నిల్వలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకు వనపర్తి కలెక్టరేట్‌ వేదిక కానుంది. ఉమ్మడి జిల్లాలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కేఎల్‌ఐ, కోయిల్‌సాగర్‌ తదితర ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఇప్పటికే సుమారు 4 లక్షల ఎకరాలకు పైబడి వరిసాగు చేసినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కేవలం 5.5 టీఎంసీల నిల్వ ఉన్న జూరాల నీటితో పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించటంపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ప్రియదర్శిని జూరాల జలాశయం

వనపర్తి/గద్వాల: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద వస్తోందని సంబురపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. అయితే వీరి ఆనందం తాత్కాలికమేనని జూరాలకు తగ్గిన వరదతో స్పష్టమైంది. ప్రియదర్శిని జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 15 రోజులకు పైగా భారీగా వరద వచ్చి చేరగా.. ఆదివారం నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు జూరాల క్రస్ట్‌గేట్లను పూర్తిగా మూసివేశారు. పదేళ్ల కాలంలో వానాకాలం క్రస్ట్‌గేట్లను పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం తిరిగి ఎనిమిది గేట్లు తెరిచారు. దీనితో పాటు విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలకు నీటి విడుదలను తగ్గించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిపంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్‌ వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేస్తామంటున్న అధికారుల ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వనపర్తిలో జరిగే ఇరిగేషన్‌ బోర్డు సమావేశంలో పంటలకు సాగునీటి లెక్కలు తేలనున్నాయి.

గడ్డు కాలమే..

వానాకాలంలో నెలన్నర రోజులపాటు జూరాల జలాశయం నీరులేక వెలవెలబోయింది. వానాకాలంలో జలాశయం అడుగంటిన పరిస్థితి దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. దీంతో అధికారులు జలాశయంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాజెక్టు ఆయకట్టులో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కృష్ణాబేసిన్‌ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఊరట పొందిన అన్నదాతలు.. వానదేవుడిపై భారం వేసి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. నెట్టెంపాడు కింద 1.20లక్షలు, జూరాల కుడి కాల్వ పరిఽధిలో 20వేలు, భీమా లిఫ్ట్‌–2 కింద 92వేలు, జూరాల ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో 73,639, ఎంజీకేఎల్‌ఐ కింద 1,18,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా వరిసాగైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement