వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా డా. భాస్కర్‌నాయక్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ డా. రవీంద్రనాయక్ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓగా కొనసాగుతున్న డా. సాయినాథ్‌రెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతకాలంగా వైద్య, ఆరోగ్యశాఖలో చెప్పకోదగిన సంఘటనలు చోటు చేసుకోవడం.. వెనువెంటనే జిల్లా వైద్యాధికారిని మారుస్తూ ఉత్తర్వులు వెలువడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కోటిలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం చేపట్టి వివిధ పూజలు చేశారు. అన్నాభిషేకం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రతి ఇంటిపై
జాతీయ జెండా ఎగరాలి
వనపర్తిటౌన్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట, ప్రధాన కూడళ్లలో వాహనదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ బచ్చు రాము, రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, ఆర్.వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు, మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


