మరుగుదొడ్లు లేని పాఠశాల ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లు లేని పాఠశాల ఉండొద్దు

Aug 12 2026 12:46 AM | Updated on Aug 12 2026 12:46 AM

వనపర్తి: జిల్లాలో మరుగుదొడ్డి లేని పాఠశాల లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న అన్ని పనులు సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, విద్యా, గ్రామీణాభివృద్ధి, జిల్లా సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కొనసాగుతున్న నిర్మాణాలపై చర్చించారు. పెబ్బేరు మండలానికి గవర్నర్‌ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 4 బోర్లు వేయించడం వంటి పనులు ఇంకా పూర్తిగాకపోవడానికి కారణాలు ఏమిటని ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన వేంకటేశ్వరస్వామి ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా పాఠశాలలో మరుగుదొడ్లు లేకుంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఇందిరాశక్తి భవనం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని, జిల్లాకు 133 గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు మంజూరుకాగా.. పనులు పురోగతిలో ఉన్న 53 భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. 33 ఫుడ్‌ గ్రైన్‌ స్టోరేజ్‌ భవనాలు అక్టోబర్‌ చివరి నాటికి పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు రోజూ క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షించాలని.. అందుకు సంబంధించిన ఫొటోలు తనకు పంపించాలని సూచించారు. అంగన్‌వాడీ, వీఓ భవనాలు, డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా చేపడుతున్న పనులు సైతం త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా స్థలం సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో వీబీజీ రాంజీ పథకంలో అత్యధిక పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, జెడ్పీ సీఈఓ యాదయ్య, పంచాయతీరాజ్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌ విజయ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీఆర్డీఓ రామమహేశ్వర్‌రెడ్డి, సీపీఓ హరికృష్ణ, డీడబ్ల్యూఓ సుధారాణి, పంచాయతీరాజ్‌ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement