ప్రత్యామ్నాయ సాగు బాధ్యత వ్యవసాయ అధికారులదే.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ సాగు బాధ్యత వ్యవసాయ అధికారులదే..

Aug 6 2026 12:27 AM | Updated on Aug 6 2026 12:27 AM

వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి ఎల్‌నినో పరిస్థితులు, పంటమార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్‌ భగీరథ తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉందని, ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఒకసారి నిండితే సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పంటల మార్పిడిపై లక్ష్యాలు నిర్దేశించి వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. జిల్లాలో వేరుశనగ, మినుములు, కంది సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వేరుశనగ సాగు విస్తీర్ణాన్ని 30 వేల నుంచి 40 వేల ఎకరాలు, మినుము సాగును 30 వేల ఎకరాలకు పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యానశాఖ పనితీరును సమీక్షిస్తూ ఆయిల్‌పాం లక్ష్యాలపై పలు సూచనలు చేశారు. ఆయిల్‌పాం సాగు లక్ష్యాన్ని 6 వేల ఎకరాలకు పెంచాలని, కూరగాయల సాగు 7 వేల ఎకరాల్లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గుడిసెలను ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌కు అర్హులైన కుటుంబాలను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎల్‌–1 జాబితాలో అర్హులైన కుటుంబాల వివరాలను ఉన్నతాధికారుల లాగిన్‌కు పంపించాలని సూచించారు. ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ) హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement