అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, నీటిపారుదల వసతులు కల్పించినప్పుడే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దశాబ్ద కాలానికిపైగా ప్రధాని మోదీ అపూర్వ ప్రగతి సాధించినట్లు ఒక చిత్రాన్ని ప్రాజెక్టు చేస్తోందని ఆరోపించారు. దళిత ఆదివాసీలపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న న్యూడిల్లీలోని రాంలీలా మైదానంలో జరగబోయే యే బద్లావ్ జరూరీ హై ర్యాలీతో ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అబ్రహం, మక్తల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీహరి, కో–కన్వీనర్ నర్సింహ, లక్ష్మి శెట్టి, శ్యాంసుందర్, భాస్కర్, మోషా, నాగరాజు, లక్ష్మీనారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు.


