పాన్‌గల్: ఫర్టిలైజర్ డీలర్లు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మల్లాయిపల్లి, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి, పాన్‌గల్‌లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, రికార్డులను పరిశీలించారు. దుకాణం ఎదుట నిల్వ వివరాలు, ధరలు ప్రదర్శించాలన్నారు. ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ ఫ్రేమ్‌వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ యాప్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండటంతో దుకాణాల్లో స్టాక్ వివరాలు, ఈపీఓఎస్ మిషన్ స్టాక్‌ను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో తెలియని వ్యక్తులు విక్రయించే నకిలీ డీఏపీ, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్‌ను కొనుగోలు చేయవద్దని కోరారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ ఏఓ రమేష్‌నాయక్ ఉన్నారు.


