ఖిల్లాఘనపురం: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని.. కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌కోడ్లు అమలు చేయడంతో కార్మికులు చట్టబద్దమైన హక్కులు కోల్పోతున్నారని, యాజమాన్యాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. పరోక్షంగా సమర్థిస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెబుతున్నా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని.. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నాయకులు, కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, వెంకటేష్, నాగయ్య, మునేందర్, శివ, నజ్మ, పద్మ, సంగీత, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


