● సమస్యల వలయంలో జీజీహెచ్
● 205కుపైగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు
● కదలిక లేని ఆర్‌కేఎస్,
హెచ్‌ఎంసీ కమిటీలు
● రోజురోజుకు పెరుగుతున్న
రోగుల సంఖ్య
వనపర్తి: ఆస్పత్రి నిర్వహణ, రోగుల సంక్షేమం, నిధుల వినియోగం, సమస్యల పరిష్కారం, వైద్యసేవలను పర్యవేక్షించాల్సిన ఆర్‌కేఎస్ (రోగి సంక్షేమ సమితి), హెచ్‌ఎంసీ (హాస్పిటల్ మేనేజ్‌మెట్ కమిటీ)లు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ.. మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల మంది రోగులు వైద్యం కోసం వచ్చే జిల్లా జనరల్ ఆస్పత్రిపై అధికార, పాలకవర్గం సరైన దృష్టి సారించడం లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఇనుప మంచాలు తుప్పుపట్టగా, కిటికీలు పగిలిన అద్దాలతో దర్శనమిస్తున్నాయి. ఇక శుద్ధజల కేంద్రం వద్ద నిత్యం చిత్తడే. రక్త పరీక్షల విభాగంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విద్యార్థులతో రక్త సేకరణ చేయడం, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల కోసం బయటకు సిఫారస్ చేస్తుండటం లాంటివి వెలుగు చూస్తున్నాయి.
రోగాల సీజన్ వచ్చినట్లే..
వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యసేవలు, వైద్యుల కొరత లేకుండా చూడటంతో పాటు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు ముందస్తుగా సమావేశమై.. కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆయా కమిటీలు ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు ఒకటి రెండు కంటే ఎక్కువగా లేవు. అందులోనూ.. ఒక్కరిద్దరు సభ్యులే వచ్చినట్లుగా తెలుస్తోంది. నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు వెయ్యి నుంచి 1,100 మందికిపైగా ఓపీ వస్తుండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది.
సేవల మెరుగే ప్రధాన లక్ష్యం..
ఆర్‌కేఎస్, హెచ్‌ఎంసీ సభ్యులు జీజీహెచ్‌లో వైద్య, ఇతర సేవలను మెరుగుపర్చాలి. కానీ ఆ దిశగా కమిటీలు పని చేసింది తక్కువేనని చెప్పవచ్చు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి సభ్యులు హాజరై ఉచిత సలహాలు ఇవ్వటమనే ధోరణి ఇప్పటి వరకు కొనసాగడం శోచనీయం.
పర్యవేక్షణకు నోచుకోని అంశాలు..
రోగులకు స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య చర్యలు నిర్దేశించిన సమయానికి చేపట్టడం, టోకెన్ల జారీ ప్రదేశాల్లో వసతులు, బెడ్లు, ఫర్నీచర్, విద్యుత్, జనరేటర్, పవర్ బ్యాకప్ అంశాలను పరిశశీలించాలి. విద్యుద్ధీపాలు, ఫ్యాన్లు, ఆస్పత్రి పైకప్పు నుంచి వర్షపునీరు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వనపర్తి జీజీహెచ్‌లో అత్యవసర విభాగం ముఖద్వారం వద్ద వర్షపు నీరు లోనికి వస్తోంది.
జిల్లా ఆస్పత్రిలో ఖాళీలు..
విభాగం మంజూరైన పనిచేస్తున్న ఖాళీలు
పోస్టులు వారు
ప్రొఫెసర్లు 22 13 9
అసోసియేట్ ప్రొఫెసర్లు 24 6 18
అసిస్టెంట్ 90 24(రెగ్యులర్) 53
13 (కాంట్రాక్ట్)
సిబ్బంది (అన్ని విభాగాలు) 489 361 128
● వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? సిబ్భంది అందుబాటులో ఉన్నారా..?
● మందుల కొరత, ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాల నిర్వహణ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్యసేవలు నిర్వహణ, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, అంబులెన్స్ సేవలు, ఆస్పత్రిలో స్వచ్ఛత, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత, బయో వేస్టేజ్ నిర్వహణ, రోగుల ఫిర్యాదులు, మరణాలు, ముఖ్యంగా శిశు మరణా లపై సమీక్షలు, ఆస్పత్రి భద్రత, ప్రభుత్వ ఆరోగ్య పథకాలను నిత్యం పరిశీలించాల్సి ఉంటుంది.


